Monday, November 28, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-17 ---- Daily One SHORT STORY for all - 28/11/2022

 ♥️ కథ - 17 ♥️   



అనుభూతి:  నాకు సరైన మార్గాన్ని చూపిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను


ఒక వాస్తవ గాథ


హ్యారీ ఒక పేద వృద్ధుడు. రోజూ రాత్రి వీధిలో పడుకునే అవసరం రాకుండా ఉండడం కోసం రోడ్డు పక్కన కూర్చుని డబ్బులు అడుక్కునేవాడు.

ఒకరోజు ఉదయం, ఎప్పటిలాగే అతను చాప వేసుకొని, భిక్షాటన కోసం తన పాత్ర ను బయటపెట్టి, భిక్ష అడగడం ప్రారంభించాడు. సమీపంలో చాలా కార్యాలయాలు ఉన్నాయి, ప్రతిరోజూ ఉదయం చాలా మంది అతనిని దాటి వెళ్తున్నారు. కానీ ఆ రోజు, అతని అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో, నిరుత్సాహానికి గురయ్యాడు.


 ఆ రోజు తన అదృష్టం మారబోతోందని అతనికి తెలియదు. 

ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెళ్తూ, హ్యారీని చిరునవ్వుతో పలకరిస్తూ, పాత్ర లో $20 పెట్టింది. ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో అతను ఆశ్చర్యపోయాడు! కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ వృద్ధుడు ఆమె పేరు అడిగాడు.

ఆమె నవ్వుతూ తన పేరు సారా అని చెప్పింది. వృద్ధుడు చాలా సంతోషించి, "ఈ రాత్రి నేను వీధిలో పడుకోనవసరం లేదు! మీకు ధన్యవాదాలు, నేను ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను" అని ఉత్సాహంగా ఆమెకు చెప్పాడు. 

అప్పుడతను "నాకెందుకు ఇంత సహాయం చేసావు?" అని అడిగాడు.

సారా చాలా ప్రేమగా బదులిచ్చింది, "మనం ఏ పని చేస్తే దానిని ఖచ్చితంగా ప్రకృతి  మనకు తిరిగి ఇస్తుందని నేను నమ్ముతాను. మనం చెప్పేది, చేసే ప్రతిదీ తిరిగి మన వద్దకే వస్తుంది!"

వారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, సారా తన భోజన విరామం ముగియడంతో అక్కడి నుండి బయలుదేరవలసి వచ్చింది. ఆమె అతనికి మంచి జరగాలని కోరుకుంటూ, వీడ్కోలు పలికింది.


కాసేపటి తర్వాత  హ్యారీ ఆ రోజుకి సరిపడా డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి. వచ్చిన డబ్బును లెక్కించడం ప్రారంభించినప్పుడు, పాత్ర లో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. అక్కడ పడి ఉన్న ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, అది అక్కడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు.

సారా డబ్బు పెట్టినప్పుడు అప్పుడు పొరపాటున పాత్ర లో ఉంగరం పడిపోయిఉంటుందని  అతనికి అనిపించింది.

వెంటనే ఆమె కోసం వెతకడానికి వెళ్ళాడు, వీధుల్లో చుట్టూ చూస్తూ, సమీపంలోని కార్యాలయాల్లో ఆమె కోసం అడిగాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో వెతికి వెతికి అలిసిపోయాడు.

అకస్మాత్తుగా, అతని మనస్సులో దురాశ మొదలైంది. ఆ ఉంగరం అమ్మితే కొన్ని నెలలపాటు వీధిలో పడుకునే అవసరం ఉండదని అనుకున్నాడు!

 వెంటనే ఒక స్వర్ణకారుని దుకాణంలోకి వెళ్లి, ఉంగరానికి ఎంత ఇస్తావని అడిగాడు. స్వర్ణకారుడు అతనికి $4000 ఇచ్చాడు, అది విని హ్యారీ తన చెవులను నమ్మలేకపోయాడు.  

అతనికి అది చాలాపెద్ద మొత్తం! ఆ డబ్బు తీసుకుని కొన్ని నెలలు విలాసవంతంగా గడపాలని తాపత్రయపడ్డాడు. దానితో తాను పొందే అన్ని సౌకర్యాలను, ప్రశాంతంగా నిద్రపోగలిగే వెచ్చని రాత్రులను ఊహించుకోగలడు!


 కానీ …… 

అకస్మాత్తుగా, సారా మాటలు అతని చెవులలో మారుమ్రోగాయి: "మనం ఏమి చేస్తే, ప్రకృతి ఖచ్చితంగా మనకు దానిని తిరిగి ఇస్తుంది."

అది ఒక మెరుపులా తాకింది, ఆ మాటలు తిరిగి అతనిని వర్తమానంలోకి తీసుకువచ్చాయి, తప్పును గ్రహించాడు. ఉంగరాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకుని, సారా కోసం వెతకడానికి దుకాణం బయటకు వచ్చాడు. 

సమీపంలోని అన్ని కార్యాలయాలకు వెళ్లాడు. అప్పుడు ఆమె వెనుక వీధిలో పని చేస్తున్నదని అనడం  గుర్తువచ్చింది.

అందుకని, ఆ వీధిలోకి వెళ్ళాడు, ప్రతి కార్యాలయంలో ఆమె కోసం అడుగుతూ చివరగా, అక్కడ ఉన్న ఆఖరి కార్యాలయానికి చేరుకుని, "సారా అనే మహిళ ఇక్కడ పనిచేస్తుందా?" అని అడిగాడు.

అక్కడ తను ఆమెను కనుగొన్నాడు.

ఆమె అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయి,కలవరపడి,  ఎలా సహాయం చేయగలదని అడిగింది.

 వెంటనే ఆమె ఉంగరాన్ని తీసిఇచ్చి, ఇలా అన్నాడు, "ఇది నీదేనని నేను అనుకుంటున్నాను. నువ్వు డబ్బు వేస్తున్నప్పుడు అది నా పాత్ర లో పడింది." 

ఆ ఉంగరాన్ని చూసిన సారా సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంది. ఆమె హ్యారీకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. "మీరు దానిని తిరిగి తీసుకువచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను. ఇది నాకు ఎంత విలువైనదో మీకు తెలియదు!" అని కన్నీళ్లు పెట్టుకుంది. 

కానీ ఆమె తన ఆసక్తిని ఆపుకోలేక , "కావాలంటే, మీరు ఉంగరాన్ని అమ్మి, చాలా డబ్బు సంపాదించవచ్చు. మీరు దీనిని ఎందుకు తిరిగి ఇచ్చారు ?" అని  అడిగింది.

 హ్యారీ ఇలా అన్నాడు, "మీరు నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు. దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇదే. అదే కాకుండా, ఒక వివేకమైన మహిళ, మనం ఏమి చేస్తే, ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి ఇస్తుంది అని చెప్పగా విన్నాను."


వృద్ధుడి మాట వినగానే ఆమె గుండె దడదడలాడింది. అది తన పెళ్లి ఉంగరం అని, అతని దయను తాను ఎప్పటికీ మరచిపోలేనని వివరిస్తూ, హృదయపూర్వకంగా మళ్లీ కృతజ్ఞతలు తెలిపింది.

ఇలా చెప్పి, హ్యారీ ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వెళ్లిపోయాడు.

అతను వెళ్లిపోయిన తర్వాత, సారా సహోద్యోగి ('GoFundMe') ' గో ఫండ్ మీ' అనే వెబ్‌సైట్ ద్వారా వృద్ధుడికి సహాయం చేయవచ్చని సూచించాడు. అక్కడ ఆమె తన కథను పంచుకోవచ్చు, ప్రజల నుండి విరాళాలు సేకరించవచ్చు.

సారా సంతోషించి, "నేను ఇది ఖచ్చితంగా చేస్తాను. ఈ కథను చదివిన దాతలు విరాళాలు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను" అని చెప్పింది.

ఆమె హ్యారీ కోసం క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించింది. తన ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుంది, హ్యారీ దానిని ఎలా తిరిగి ఇచ్చాడు అని ఆమె వ్రాసిన కథనంతో అది బాగా ప్రాచుర్యాన్ని పొందింది. 

ప్రజలు దయతో విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. 

కొద్ది రోజుల్లోనే, ఆమె $190,000 విరాళాలు సేకరించింది. ఆ తర్వాత హ్యారి ని వెతకడానికి బయలుదేరింది.


వారు మొదట కలుసుకున్న అదే స్థలంలో ఆమె అతన్ని చూసి, ఒక బ్యాగ్ ఇచ్చింది. అతనికి సహాయం చేయడానికి ఆమె తనకి అవసరమయ్యే వస్తువులను తెచ్చిందని అనుకుని చాలా కృతజ్ఞతలు తెలిపాడు. 

అయితే బ్యాగ్ తెరిచి డబ్బులు చూసే సరికి నోరు మెదపలేకపోయాడు. 

సారాను, "నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు?!" అని అడిగాడు.

సారా చిరునవ్వుతో, "ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం. నువ్వు సంపాదించుకున్నదే!", అని అంది.

 అతని నిజాయితీకి, దయకి ప్రజలు ఇష్టపడి, ' గో ఫండ్ మీ' ( GoFundMe ) ద్వారా  $190,000 విరాళంగా ఎలా ఇచ్చారో, ఆమె చాలా ఆనందంగా వివరించింది. 

ఇప్పుడు హ్యారీ ఇంక వీధిలో రాత్రులు గడపవలసిన అవసరం లేదు, ఈ డబ్బుతో తనకోసం ఒక స్వంత ఇల్లు కొనుక్కోవచ్చునని చాలా ఉత్సాహపడింది.

ఇది విని ఉప్పొంగిపోయి, హ్యారీ ఆనందభాష్పాలతో సారాకు దీవెనలు ఇచ్చాడు. సారా హృదయం కూడా ఆనందంతో ఉప్పొంగింది. ఆమె వృద్ధుడికి వీడ్కోలు పలికినప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.


ఆమె వెళ్లిపోయిన తర్వాత, వృద్ధుడు ఆ బ్యాగ్‌లో ఒక కాగితం ముక్క ఉండటం చూశాడు, "ప్రకృతి ఎల్లప్పుడూ మనం చేసే పనిని మనకు అందిస్తుంది. ఏదో ఒకవిధంగా మన చర్యలు ఎల్లప్పుడూ మనవద్దకు తిరిగి వచ్చే మార్గం ఉంటుంది" అని రాసి ఉంది.



                       ♾️



హృదయం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతుంది. మనకు సరైన మార్గనిర్దేశం చేస్తుంది, కానీ దురాశ, అహం మనల్ని తప్పుదారి పట్టిస్తాయి." 🌼

దాజీ


హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం  💌


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu


Friday, November 25, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-16 ---- Daily One SHORT STORY for all - 25/11/2022

  ♥️ కథ-16 ♥️


అనుభూతి - ప్రజలను హృదయపూర్వకంగా క్షమించగల నా సామర్థ్యానికి నేను కృతజ్ఞుడను


నిజమైన క్షమాపణ


ఒకసారి, గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చునియుండగా, చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు.

అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించేవాడు. కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే, ప్రజలు పెద్ద సంఖ్యలో అయన వైపుకు ఆకర్షించడుతున్నారు అని అనుకున్నాడు!

అతను ఒక వ్యాపారవేత్త, అతని పిల్లలు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించడంలో, మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా, బుద్ధుడితో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళనపడ్డాడు.

ఎప్పుడూ కళ్లు మూసుకుని కూర్చుని ఉండే వారి ప్రక్కన, రోజులో నాలుగు గంటల సమయం గడపడం పూర్తిగా  వృధా అని భావించాడు.

దీనితో కలత చెంది, విసిగిపోయి,"నేను ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పాలి!", అని అతను నిర్ణయించుకున్నాడు.

మనసు నిండా కోపంతో బుద్ధుడి వైపు ధైర్యంగా నడిచాడు.

బుద్ధుని దగ్గరికి రాగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి, కానీ అతనిలోని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు.

తన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్మివేసాడు.

బుద్ధుడు బదులుగా నవ్వాడు.

బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి ఆ వ్యక్తిపై చాలా కోపం వచ్చింది. వారు అతని మీదకు దూకడానికి సిద్ధమయ్యారు, కానీ బుద్ధుని ఎదురుగా వారు ఏమి చేయలేక ఆగిపోయారు. 

బుద్ధుడితో ఎవరైనా అంత  అవమానకరంగా ప్రవర్తించగలరని వారు నమ్మలేకపోయారు! కానీ వారు ఏమీ అనలేకపోయారు.

 అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి ప్రతిచర్య రాలేదు,  పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాడు అంతే. 

ఇంక అక్కడ అతను ఎక్కువసేపు ఉండలేడని గ్రహించాడు.

 " ఇంక ఎక్కువసేపు ఉంటే, బహుశా నేనే ప్రేలిపోతానేమో!", అని అనుకుని వెళ్ళిపోయాడు.

ఇంటికి తిరిగి వచ్చేసినతర్వాత కూడా, తన మనస్సు నుండి గౌతమ బుద్ధుని చిరునవ్వుతో ఉన్న ముఖ చిత్రాన్ని చెరిపేయలేకపోయాడు. తాను చేసిన లాంటి అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని తన జీవితంలో మొదటి సారి కలుసుకున్నాడు.

ఆ రాత్రి అతనికి  నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ, కంపించిపోతున్నాడు, చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోతున్నట్లుగా భావించాడు.

మరుసటి రోజు, వెళ్లి బుద్ధుని పాదాలపై పడి, "దయచేసి నన్ను క్షమించండి!

నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు."అని వేడుకున్నాడు.

దానికి బుద్ధుడు, "నేను నిన్ను క్షమించలేను" అని సమాధానమిచ్చాడు.

అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితమంతా, బుద్ధుడు చాలా దయాగుణంతో గడిపాడు. అందరినీ, వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించాడు. ఇప్పుడు ఈ వ్యాపారితో క్షమించలేనని చెబుతున్నాడా..?" అని అనుకున్నారు.

బుద్ధుడు చుట్టుపక్కల చూసి, అందరూ ఆశ్చర్యపోయినట్లు గమనించాడు.

బుద్ధుడు ఇలా వివరించాడు, "మీరు ఏమీ చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి?

నేను నీ ప్రవర్తనను క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి?".

వ్యాపారవేత్త బదులిస్తూ, "నిన్న నేను వచ్చి, కోపంతో మీ ముఖం మీద ఉమ్మివేసాను. ఆ వ్యక్తిని నేనే!".

గౌతమ బుద్ధుడు, "ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు, మీరు ఉమ్మి వేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే, మిమ్మల్ని క్షమించమని చెబుతాను." అని అన్నాడు.

“ నాకు - ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవు. నీవు అద్భుతమైనవాడివి. నువ్వు ఏ తప్పూ చేయలేదు."

జీవితంలో ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు క్షమిస్తాము?

నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు, ఆ వ్యక్తి క్షమింపబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు. ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధభావాన్ని కూడా కలిగించకూడదు.

అదే సరైన క్షమాపణ.

మనం ఎవరినైనా క్షమించి, వారి తప్పుల వారికి గుర్తుచేస్తూ, వారికి ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే, నిజానికి, మనం వారిని ఇంకా క్షమించలేదని అర్ధం.

ఒక వ్యక్తికి తాను తప్పు చేసినట్లు గ్రహించడమే, ఆ వ్యక్తికి తగిన శిక్ష.     


మనకు ఎవరితోనైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, వారిని మనం క్షమించినప్పుడే                                                     మన మానసిక భారం తొలగిపోతుంది. 🌼


దాజీ


హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం  💌


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu


Thursday, November 24, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-15 ---- Daily One SHORT STORY for all - 24/11/2022

 ♥️ కథ - 15 ♥️   


 అనుభూతి  -  జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నేను 

                      కృతజ్ఞుడను


అభిరుచి



ఆలోచిద్దాం : జీవితంలో మనం ఎప్పుడైనా ఓడిపోతే, తిరిగి ఎలా పురోగమించాలి?  

               జీవితంలో కొత్త లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి ? 

               దానిని ఎలా ఆచరణలో పెట్టి, సాధించుకోవాలి ?


 స్పెయిన్ కు చెందిన 10 ఏళ్ల బాలుడు ఫుట్ బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు.  

 తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, "చూడండి, నేను ఒక రోజు స్పెయిన్ లో కెల్లా ఉత్తమ ఫుట్ బాల్ క్రీడాకారుడినవుతాను. 

నాకు గోల్ కీపింగ్ ఇష్టం కాబట్టి నేను ఉత్తమ గోల్ కీపర్ని అవుతాను" అని చెప్పేవాడు.

 తల్లిదండ్రులు అతని ఆత్మవిశ్వాసాన్నినమ్మి, ఒక శిక్షణా సంస్థలో చేర్చారు. అతను  ఫుట్ బాల్ మైదానానికి వెళ్లడం ప్రారంభించాడు. 

అక్కడ కూడా, తన కోచ్ తో, "చూడండి, ఏదో ఒక రోజు నేను స్పెయిన్ లో కెల్లా పెద్ద  ఫుట్ బాల్ ఆటగాడిగా ఎదుగుతాను. రియల్ మాడ్రిడ్ ఒక పెద్ద ఫుట్ బాల్ క్లబ్, ఒక రోజు, నేను ఈ క్లబ్ కోసం గోల్ కీపింగ్ చేస్తాను." అని చెప్పేవాడు. 

కోచ్ కూడా అతని కళ్ళలో మెరుపును చూడగలిగాడు, బాలుడికి శిక్షణ ఇవ్వడంలో తన వంతు కృషి చేశాడు.

కాలం గడిచిపోయింది, ఆ 10 ఏళ్ల బాలుడు 20 సంవత్సరాల కుర్రవాడు అయ్యాడు. ఈ 10 సంవత్సరాలలో, అతను అగ్రశ్రేణి ఆటలన్ని ఆడి, తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. తన కలల జట్టు ఐన రియల్ మాడ్రిడ్ లో చేరాల్సిన రోజు దగ్గరపడుతోంది.

 దురదృష్టవశాత్తు, ఆ రోజు రాకముందే, తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 అతని నడుము కింది భాగం పక్షవాతానికి గురైందని, ఫుట్ బాల్ ఆడటం ఏమిటి, అసలు అతను నడిచే అవకాశం కూడా లేదని డాక్టర్ తల్లిదండ్రులకు తెలియజేశాడు!

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ చిరకాల స్వప్నం అలా చెదిరిపోయిందన్న వాస్తవాన్ని వారు అంగీకరించలేకపోయారు!

 వాళ్ళు ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి ఓదార్చి,“ బాబు, నీ ముందున్న జీవితం ఇకపై నీవు కోరుకున్నట్లు ఉండబోదు, కాబట్టి ధైర్యం తెచ్చుకో” అన్నారు.

డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఆ కుర్రవానికి చెప్పగానే అతను ఒక్కసారిగా లోపల నుండి వణికిపోయాడు. 

ఆ క్షణంలో, అత్యంత ప్రతిష్టాత్మకమైన తన కలను సాధించడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఆవిరైపోయినట్లు అనిపించింది. ఈ వార్తతో అతను పూర్తిగా క్రుంగిపోయాడు.  

 ఆ తర్వాత 18 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ సమయంలో అతడిని ఎన్ని ప్రతికూల ఆలోచనలు వెంటాడి ఉంటాయో ఊహించడం చాలా కష్టం!

కానీ ఆశ్చర్యకరంగా, తన అతను పరిస్థితులకు లొంగిపోలేదు, ఇంకా బలంగా వెనక్కితిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. 

అతడికి వ్రాయడం పట్ల అభిరుచి ఉంది. అందువల్ల, పాటలు, కవిత్వం వ్రాయడం ద్వారా ఆసుపత్రిలో తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడు. అలాగే పాడటం కూడా మొదలుపెట్టాడు.

ఫలితంగా, అతని దృష్టి పూర్తిగా ఫుట్ బాల్ నుండి సంగీతం వైపుకు మళ్లింది. 

అతను ఇప్పుడు సంగీతాన్ని అన్వేషించాలని , ఈ కొత్త రంగంలో అసాధారణమైనదాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు అనిపించింది.

 ఒక్కసారి ఊహించుకోండి, ఆసుపత్రిలో ఒక కుర్రవాడు నూతన మార్గాల గురించి కలలు కంటున్నాడు, సంగీతంలో కొత్త అవకాశాల గురించి కలలు కంటున్నాడు!  ఇది నమ్మశక్యం కాని విషయం!

 ఐదేళ్ల తర్వాత ఒక పాటను కూడా విడుదల చేశాడు, అది చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

ఆ పాట పేరు 'లైఫ్ గోస్ ఆన్ ద సేమ్'. (జీవితం అలానే సాగిపోతుంది) ఆ కుర్రవాడు  స్పెయిన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకడు అయ్యాడు! 

 అతని పేరు *జూలియో అగ్లేజియస్ *, ఇది అతని యధార్థ కథ!

 ఇప్పటివరకు, అతని ( ఆల్బంలు ) పాటలు 300 మిలియన్లకు పైగా అనేక భాషలలో అమ్ముడయ్యాయి.  

నిజంగా, జూలియో అగ్లేజియస్ వంటి వ్యక్తులు విలువైన స్ఫూర్తి ప్రదాతలు.

 అపజయమెదురైనా, దాని వెనుక విజయానికి మార్గం దాగి ఉంటుందనడానికి అతని జీవిత కథే నిదర్శనం. ఎప్పుడైనా మన కల ముగిసిపోతే, మరొక కొత్త కల కని, దాని కోసం కృషి చేయవచ్చు! 



  స్వీయ-అంగీకారం అనేది వ్యక్తిగత పరివర్తనకు అవసరమైన అత్యంత ముఖ్యమైన వైఖరి. 🌼


    దాజీ


                    ♾️


 హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం  💌



టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Monday, November 21, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-14 ---- Daily One SHORT STORY for all - 21/11/2022

 ♥️ కథ - 14 ♥️



అనుభూతి - నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడను



తండ్రి ఆశీర్వాదం

 అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 

ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  

త్వరలోనే  నగరంలోని సంపన్నులలో , ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 

ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు. 

ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు.

ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. 

ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.

సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా,వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. 


ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

 అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 

అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.

“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”

ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, “మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు",  అని ఆ మాటలు మాట్లాడుతూ , ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.

ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 

అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.

కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.


తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. 

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

    

   ♾️


ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.


లాలాజీ



టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Friday, November 18, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-13 ---- Daily One SHORT STORY for all - 18/11/2022

 


 ♥️ కథ-13 ♥️


 అనుభూతి - నాలో ఉన్న దయాగుణానికి నేను కృతజ్ఞుడను


 పూజారి కుమారుడు


 ఒక రాజ్యంలో, మహా జ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన ఒక పూజారి ఉండేవాడు. ఆయన వివేకం చాలా ప్రాంతాలలో ప్రశంసించబడేది, చర్చించబడేది.


 ఒకరోజు, మహారాజు పూజారిని తన ఆస్థానానికి ఆహ్వానించి, ఆస్థానానికి చేరుకున్నాక, ఆయనతో చాలా విషయాలపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించాడు.

 చర్చ ముగిసిన తరువాత పూజారి బయలుదేరుతుండగా, రాజు ఆయనతో, "గురుదేవా! మీరు అనుమతిస్తే, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను." అన్నాడు.

 

పూజారి, "అడగండి, ప్రభూ" అన్నాడు.

" మీరు చాలా తెలివైనవారు, కానీ మీ కుమారుడు ఎందుకు అంత తెలివితక్కువగా ఉన్నాడు?"  అని అడిగాడు.


ఊహించని ఈ ప్రశ్నకు పూజారి కంగుతిన్నాడు.  " మహాప్రభూ, మీరు అలా ఎందుకు అంటున్నారు?" అని అడిగాడు.

 ‘‘ బంగారం, వెండిలో ఏది విలువైనదో కూడా మీ కుమారునికి తెలియదు’’ అని రాజు ఆక్షేపించాడు.

అది విని అక్కడున్న సభికులందరూ నవ్వడం మొదలుపెట్టారు.

పూజారి అందరి వైపు అయోమయంగా చూసి, అవమానంగా భావించి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంటికి చేరుకున్నాడు.

 రాజు గారి మాటలు, సభికుల నవ్వులు మనస్సులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అతను చాలా విచారంగా ఉన్నాడు.


 కొడుకు తండ్రి దిగులుగా ఉండడం చూసి, “ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు?” అని అడిగాడు.


 పూజారి, "బాబు, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను." 

" అడగండి నాన్నగారు", అన్నాడు కొడుకు.


 " బంగారం, వెండి రెంటిలో విలువైనది ఏది?"అని  పూజారి అడిగాడు.


 " బంగారమే విలువైనది," అని కొడుకు సమాధానం చెప్పాడు. 

కొడుకు సమాధానం పూజారికి కాస్త ఊరటనిచ్చింది.  

అతను “నువ్వు సరైన సమాధానమే చెప్పావు,  అలాంటప్పుడు రాజు నిన్ను మూర్ఖుడు అని ఎందుకు అన్నాడు?  బంగారం, వెండి విలువల మధ్య నీకు తేడా తెలియదని ఎందుకన్నాడు?” అని అడిగాడు.


తండ్రి ద్వారా జరిగిన సంఘటన అంతా విన్న కొడుకు తండ్రిని కలవరపెడుతున్న విషయం అర్థం చేసుకున్నాడు.  

అతను వివరించడం ప్రారంభించి, "నాన్న! రోజూ ఉదయాన్నే నేను పాఠశాలకు రాజుగారు ప్రజలతో కొలువు తీరే ఆస్థాన ప్రాంతం ద్వారా నడుచుకుంటూ వెళ్తాను. 


అక్కడ పండితులందరూ కూర్చుని వివిధ అంశాలపై చర్చిస్తూంటారు.  


నేను అక్కడి నుండి వెళ్ళడం చూసి, రాజు నన్ను తరచుగా పిలిచి, ఒక చేతిలో బంగారు నాణెం, మరో చేతిలో వెండి నాణెం ఉంచుకుని, నాకు విలువైనదిగా దేనిని భావిస్తే, దాన్ని ఎంచుకోమని అడుగుతాడు.  


నేను రోజూ వెండి నాణెం తీసుకుంటాను. అది చూసి ప్రతిరోజూ, వారు నన్ను ఎగతాళి చేస్తారు, అక్కడ నుండి మౌనంగా వెళ్లిపోతుంటే, చూసి నవ్వుతారు." అని చెప్పాడు.


అది విన్న పూజారి చాలా కంగారు పడ్డాడు.  “వెండి కంటే బంగారం విలువైనదని నీకు తెలిసినప్పుడు, బంగారు నాణెం తీసుకోని రా. 


వాళ్ల దృష్టిలో నువ్వు మూర్ఖుడివని ఎందుకు నిరూపించుకుంటున్నావు? నీ వల్ల నేనూ అవమానానికి గురయ్యాను” అన్నాడు.


కొడుకు నవ్వుతూ, "నాతో రండి నాన్నగారు, దానికి కారణం చెబుతాను" అన్నాడు.


తన తండ్రిని నగర శివార్లకు తీసుకెళ్లాడు, అక్కడ కొంతమంది నిరాశ్రయులు, పేదలు నివసిస్తున్నారు. ఆ కుర్రవాడిని చూడగానే వారి ముఖాలు వెలిగిపోయాయి, చాలా మంది అతన్ని ప్రేమతో పలకరించారు. 


తన కుమారుడికి అంత మంది ప్రజలు ఆశీస్సులు ఇవ్వడం చూసి పూజారి ఆశ్చర్యపోయాడు.


 కొడుకు  "తండ్రీ, వీరిలో చాలా మందికి చేయడానికి పని దొరకట్లేదు, తినడానికి సరైన తిండి లేదు. నేను వెండి నాణెం తీసుకున్న ప్రతిసారీ, ఇక్కడకు వచ్చి వీరిలో ఒకరికి ఇస్తాను. 

వీరి దృష్టిలో వెండి నాణానికి చాలా విలువ ఉంది, ఎందుకంటే ఆ ఒక్క వెండి నాణెంతో చాలా మందికి  ఆహారం దొరుకుతోంది. ఆహారం తినడం వలన ఆకలి తీరి, ఆరోగ్యంగా పనికి కూడా వెళ్తున్నారు, పని చేయగలుగుతున్నారు.


 “ చేతిలో బంగారు, వెండి నాణేలతో నన్ను ఆపి ఆ ప్రశ్న అడగడం రాజుకు, ఆయన  సభికులకు ఒక ఆటగా, హాస్యంగా మారింది. తరచుగా వారు నాతో ఈ ఆట ఆడతారు, నేను ఎల్లప్పుడూ వెండి నాణెం ఎంచుకుంటాను. 


ఎందుకంటే, నేను బంగారు నాణెం తీసుకున్న రోజు, ఈ ఆట ముగుస్తుంది, అప్పుడు వీరికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు. అందుకే నేను ఎప్పుడూ బంగారు నాణెం తీసుకోను” అని చెప్పాడు.


పూజారి తన కుమారుని చూసి గర్వపడ్డాడు,  అతని దృక్కోణాన్ని అర్థం చేసుకున్నాడు, అదే సమయంలో రాజుకు నిజం చెప్పడం కూడా ముఖ్యమని భావించాడు.  


అందుకని తన కుమారుని సభకు తీసుకువెళ్ళాడు, అక్కడ బంగారం ఎక్కువ విలువైనదని తెలిసినప్పటికీ వెండి నాణెంతన కుమారుడు ఎందుకు తీసుకున్నాడో రాజుకు మొత్తం వివరించాడు.


 ఆ కుర్రవాడి వివేకం, దయాగుణం, కరుణ చూసి రాజు చాలా ముగ్ధుడయ్యాడు.  

"ఇతడు నిజమైన పండితుడు" అని చెప్పి, ఒక పెట్టె నిండా బంగారు నాణేలు ఆ కుర్రవానికి  ఇవ్వమని ఆదేశించాడు.


 నిరాశ్రయులైన ఆ ప్రజలను తగిన వసతులను కల్పించమని తన మంత్రులకు ఆజ్ఞాపించాడు.


వాస్తవానికి, ఎటువంటి డాంభికాన్ని చాటుకోకుండా కేవలం మన పనిని మనం కొనసాగించినట్లయితే, మనకు, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మనం మరింత మేలు చేయగలం.



నువ్వు ఎంత సమర్థుడవో ప్రపంచం అంతా గుర్తించే సమయం వచ్చినప్పుడు, నువ్వు బంగారంలా మెరిసిపోతావు, అందరూ నిన్ను గౌరవిస్తారు.


                                  ♾️



 జీవితానికి సక్రమమైన ఆలోచన, సరియైన అవగాహన, నిజాయితీ గల దృక్పథాన్ని పెంపొందించడంలో సహాయపడే వివేకాన్ని వృద్ధిచేసుకోవడానికి ధ్యానం మనకు సహాయపడుతుంది.

 దాజీ


                                      ♾️



హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం 💌


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Thursday, November 17, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-12 ---- Daily One SHORT STORY for all - 17/11/2022

  ♥️  కథ-12  ♥️

అనుభూతి - జీవితంలో విస్తృత దృక్పథం కలిగిఉన్నందుకు నేను కృతజ్ఞుడను


స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష)


ఒకసారి, చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగావకాశం వచ్చింది, దాని కోసం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు . చాలా మంది అభ్యర్థులు తమ పని అనుభవం, విద్యా ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 

అయితే ఇక్కడ అధికారులు కాస్త భిన్నమైన రీతిలో ప్రశ్నలు అడుగుతున్నారు.

బెల్ మోగించడం, ప్యూన్ మొదటి అభ్యర్థిని పిలవడంతో ఇంటర్వ్యూ ప్రారంభమైంది.

ఒక యువకుడు తన ఫైలు తీసుకుని ఛాంబర్‌కి వెళ్లాడు. తలుపు తెరిచి లోపలికి రావడానికి అనుమతి అడిగాడు.

"రావచ్చు," అని  ఇంటర్వ్యూ అధికారి బదులిచ్చాడు.  

యువకుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ అతని ముందు ఉన్న కుర్చీలో కూర్చోవడానికి లోపలికి వెళ్ళాడు.

అతను తన ఫైల్ వైపు చూసి, "చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి.

మీరు టూ-సీటర్ కారులో ఎక్కడికో వెళ్తున్నారనుకోండి. మీరు బస్ స్టాప్ వరకు వెళ్లేసరికి ముగ్గురు వ్యక్తులు బస్సు కోసం వేచి ఉన్నారు. 

వారిలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 90 ఏళ్ల వృద్ధురాలు. ఆమె ఆసుపత్రిలో సకాలంలో చికిత్స పొందకపోతే మరణానికి దారితీసే పరిస్థితిలో ఉంది. 

రెండవవారు,  కొంత కాలం క్రితం మీకు చాలా సహాయం చేసిన, చాలా సన్నిహిత మిత్రుడు, ఆ సహాయం వల్లనే  ఈ రోజు మీరు ఇలాఉన్నారు. 

మూడవవారు,  మీరు ఎంతో ప్రేమించే మీ ప్రియరాలు. 

 మీ కారులో ఒకరికి మాత్రమే స్థలం ఉందని అనుకుంటే, మీరు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు?”.

ఆ యువకుడు ఒక్కక్షణం ఆలోచించి "సర్, నా ప్రియురాలికి లిఫ్ట్ ఇస్తాను" అని బదులిచ్చాడు.

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ‘దీనివలన మిగిలిన ఇద్దరికీ న్యాయం జరుగుతుందా?’ అని అడిగాడు.

యువకుడు, "లేదు సార్, కానీ ఈ రోజు కాకపోతే రేపు ఆ వృద్ధురాలు చనిపోవడం ఖాయం,  నేను నా స్నేహితుడిని ఇంకోసారి ఎప్పుడైనా కలవవచ్చు, కానీ నా ప్రియురాలు ఒకసారి వెళ్ళిపోతే, ఆమెను మళ్లీ చూడలేనేమోనని అనుకుంటున్నాను." అని సమాధానం చెప్పాడు.

ఇంటర్వ్యూ అధికారి చిరునవ్వుతో, "మీ నిజాయితీగా చెప్పినందుకు  నేను సంతోషిస్తున్నాను. మీరు వెళ్ళవచ్చు" అని అన్నాడు.

కృతజ్ఞతలు చెబుతూ ఆ యువకుడు బయటకు వెళ్లిపోయాడు.

ఇంటర్వ్యూ అధికారి తదుపరి అభ్యర్థిని పిలవమని ప్యూన్‌ కు చెప్పాడు .

ఈ విధంగా, ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులందరినీ ఒకే ప్రశ్న అడిగారు. అభ్యర్థులందరూ విభిన్న సమాధానాలు చెప్పారు.

వృద్ధురాలికి లిఫ్ట్‌ ఇవ్వాలని కొందరు, స్నేహితుడికి లిఫ్ట్‌ ఇవ్వాలని కొందరు, ప్రియురాలికి లిఫ్ట్‌ ఇచ్చేందుకు మరికొందరు ఇష్టపడ్డారు. ఇలా చాలాసేపు ఇంటర్వ్యూ సాగింది.

ఒక అభ్యర్థి మాత్రం అదే ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు, "సార్, నేను నా స్నేహితుడికి నా కారు తాళాలు ఇచ్చి, వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్తాను, తర్వాత కారుని అతని ఇంటికి తీసుకెళ్ళిపోమంటాను. నేను అతని ఇంటికి వెళ్లి, నా కారుని తర్వాత తెచ్చుకుంటాను. నా ప్రియురాలితో కలిసి నేను బస్సులో వెళ్తాను."

ఇంటర్వూ తీసుకుంటున్న అధికారి ఒక్కసారిగా లేచి కరచాలనం చేసి నవ్వుతూ ఇలా అన్నాడు,” మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాం”.

" ధన్యవాదాలు  సార్’’ అంటూ ఆ యువకుడు ఆనందంగా ఛాంబర్ నుంచి బయటకు వచ్చాడు. ఇలా చివరకు ఇంటర్వ్యూ ముగిసింది.


కొన్నిసార్లు, మన ముందు ఉన్న సమస్యను  ఒక కోణంలోంచి మాత్రమే చూస్తూ  పరిష్కరించాలని చూస్తాం, అయితే సమస్య యొక్క పరిష్కారం అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవడంలో ఉంటుంది. 

జీవితంలో చాలాసార్లు, ఒకరినే ఎంచుకోవడం ప్రాధాన్యత కాదు, అందరినీ వెంట తీసుకెళ్లడమే ముఖ్యం.


మనం హృదయాన్ని విన్నప్పుడు, ఎంపికలు చేసుకునే విస్తృతమైన మానసిక ప్రక్రియ ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు; ఏది సరైనదో మనకు ఎల్లప్పుడూ తెలుస్తుంది.  


   -    దాజీ   -

                                                  ♾️


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

 

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Wednesday, November 16, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-11 ---- Daily One SHORT STORY for all

 ♥️ కథ-11 ♥️


  అనుభూతి - నాకు స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను 

 

  ప్రతీ క్షణం ఒక అవకాశమే -


 ఓసారి, ఒక యువతి తన తండ్రితో కలిసి కారు నడుపుతోంది.  కొన్ని మైళ్ల తర్వాత, వారొక తుఫానును ఎదుర్కొన్నారు.

 ఆ అమ్మాయి తన తండ్రిని ఆత్రుతగా, “ఇప్పుడు ఏమి చేయాలి??” అని అడిగింది.

తండ్రి చాలా ప్రశాంతంగా  "డ్రైవింగ్ కొనసాగించు,"  అని సమాధానం చెప్పాడు.

 ఆ అమ్మాయి చెప్పినట్లే చేసింది.  కొంత దూరం ప్రయాణించిన తర్వాత, తుఫాను తీవ్రతకు ఇతర కార్లు పక్కకు ఆగడం ఆమె గమనించింది.

 అది చూసి ఆ అమ్మాయి కంగారుగా, “నేను కూడా వెనక్కి తగ్గాలా?” అని మళ్ళీ తన తండ్రిని అడిగింది.

 దానికి తండ్రి, "వద్దు, డ్రైవింగ్ చేస్తూ ఉండు" అని బదులిచ్చాడు, ఆ అమ్మాయి అలాగే కొనసాగించింది.

 అయితే, మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత, చాలా కార్లు పక్కకు ఆగిపోవడం ఆమె చూసింది.

 అది చూసి, ఆమె తన కారు వేగం తగ్గించి, తండ్రితో, “నాన్న, దుమ్ము కారణంగా ఎదురుగా ఉన్న వాటిని నేను సరిగా చూడలేకపోతున్నాను, కాబట్టి నేను కూడా ఆగాలని అనుకుంటున్నాను” 

"తుఫాను తీవ్రతరం అయ్యేలా కనిపిస్తోంది, అందరూ వెనక్కి తగ్గుతున్నారు," అని అంది.

 కానీ ఆమె తండ్రి ఆమెను డ్రైవింగ్ కొనసాగించమని చెప్పాడు.

ఆమె మరికొంత సేపు ప్రయాణించేసరికి తుఫాను తారాస్థాయికి చేరుకుంది.  ఇప్పుడు, ఆమెకు ముందుకు వెళ్లడం మరింత కష్టంగా మారింది.  సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి కారును ఆపడం మంచిదని ఆమెకు అనిపించింది, 

కానీ ఆమె తండ్రి ప్రయాణం కొనసాగించమనడంతో  ఆమె తుఫాను గుండా ప్రయాణాన్ని కొనసాగించింది.

 తుఫానులో కూడా ఆమె డ్రైవింగ్ చేస్తూనే ఉంది.  

కొంతసేపటికి  పరిస్థితి మెరుగుపడింది, మునుపటి కంటే ఇప్పుడు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 కొన్ని మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత, చివరకు వారు తుఫాను నుండి బయటపడి, సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు.

ఆమె తండ్రి, “ అమ్మా, ఇప్పుడు నువ్వు  కారును పక్కకు ఆపి దిగొచ్చు” అని అన్నాడు.

దానికి ఆ అమ్మాయి, “ఇప్పుడు ఎందుకు?  మనం తుఫాను నుండి బయటపడ్డాం  కదా! ” అని ప్రశ్నించింది.

తండ్రి చిరునవ్వుతో, “నువ్వు బయటికి వచ్చి చూస్తే, మధ్యదారిలో ఆగిపోయిన వారందరూ  ఇంకా తుఫానులో ఇబ్బందిపడడం నువ్వు గమనించవచ్చు.  కానీ నువ్వు పట్టుదలతో ముందుకు సాగడం వలన,  తుఫానును అధిగమించావు." అని సమాధానమిచ్చాడు.

మొట్టమొదటి అడుగులో  చేసుకున్న శక్తివంతమైన సంకల్పం తుదివరకు కొనసాగిస్తే, సంపూర్ణ విజయం సాధించడంలో ఎప్పటికీ విఫలం కాదు.

 కష్ట సమయాల్లో, ఎంతటి బలమైన వ్యక్తులైనా నిరాశపడతారు,  కానీ మన మార్గానికి అడ్డుగా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మనం అక్కడే ఉండి, మన స్వంత వేగంతో ముందుకు సాగుతూ ఉంటే, ఆ కష్ట సమయాల్లో విజయవంతంగా బయటకు రావడం ఖాయం.  🕊️

                                ♾️


 మీపై నమ్మకం ఉంచండి, ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనండి.


 - దాజీ

                                                                                                                       

  హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Monday, November 14, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-10 ---- Daily One SHORT STORY for all

 ♥ కథ - 10 ♥

 అనుభూతి - జీవితపు యథార్థ సారాన్ని అర్థం చేసుకున్నందుకు నేను కృతజ్ఞుడను 

యాత్ర 


ఒక ఆదివారం ఉదయం, ఒక పెద్దమనిషి తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. తన సైజు కంటే చాలారెట్లు ఉన్న పెద్ద ఆకుని తీసుకుని బాల్కనీకి ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్తున్న ఒక చిన్న చీమ అతని దృష్టిని ఆకర్షించింది. 

ఆ వ్యక్తి గంటకు పైగా దాన్ని గమనిస్తూఉన్నాడు. చీమ తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవడం చూశాడు. అది చాలా సార్లు ఆగిపోయింది, మలుపులు తీసుకుంది, ఆపై దాని గమ్యం వైపు కొనసాగింది.

ఒక సమయంలో ఆ చిన్న చీమ నేలలో ఒక పగులును ఎదుర్కొంది. కొద్దిసేపు ఆగి, పరిస్థితిని విశ్లేషించి, ఆ పగులు పైన ఆ భారీ ఆకును వేసి, ఆ ఆకు మీదుగా నడిచి, అవతలివైపు వెళ్లిన తర్వాత  ఆకును తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది. 

భగవంతుని సృష్టిలో అతి చిన్నదైన చీమ తెలివికి ఆ పెద్దమనిషి ముగ్ధుడయ్యాడు. ఈ సంఘటన అతన్ని విస్మయానికి గురిచేసింది, సృష్టి యొక్క అద్భుతం గురించి  ఆలోచించేలా చేసింది. సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ల ముందు, ఒక చిన్నజీవి పరిమాణం లేకపోయినా, విశ్లేషించడానికి, ఆలోచించడానికి, పరిశీలించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి, అడ్డంకులను అధిగమించడానికి మెదడును కలిగి ఉంది. 


కొద్దిసేపటి తర్వాత చీమ తన గమ్యస్థానానికి చేరుకోవడం చూశాడు - భూమి లోపల ఉన్న నివాసానికి ప్రవేశ ద్వారం, నెలలో ఉన్న చిన్న రంధ్రం. ఇప్పుడు ఆ చీమ తన నివాసానికి కష్టపడి, జాగ్రత్తగా తీసుకువచ్చిన అంత పెద్ద ఆకును ఇంత చిన్న రంధ్రంలో నుండి ఎలా తీసుకువెళుతుంది, అని ఆ పెద్దమనిషి అనుకున్నాడు.


చిన్న జీవి ఐన చీమ, చాలా కష్టపడి, గొప్ప నైపుణ్యంతో, దారిలో ఉన్న అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళింది.


ఆ పెద్దమనిషి చీమ చిన్న రంధ్రంలోకి వెళ్లిన చాలా సేపటి వరకు దాని గురించే ఆలోచిస్తూ, తన జీవితాన్ని ఆ చీమ ప్రయాణంతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.

చీమ ఇంత కష్టంతో కూడుకున్న ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు, చివరికి వచ్చేసరికి ఆ పెద్ద ఆకు దానికి భారం తప్ప మరేమీ కాలేదు. 


ఆ జీవికి తన గమ్యాన్ని చేరుకోవాలంటే  దానిని వదిలివేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. చీమలాంటి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను ఇలాగే ఎదుర్కొంటామా అని ఆలోచించాడు.


ప్రయాణం చివరి భాగంలో, చీమకు ఆకు భారం తప్ప మరేమీ కాదని గ్రహించి, చాలా సులభంగా ఆ ఆకును వదిలేసి ముందుకు సాగింది. మన ప్రయాణంలో మనం కూడా బోలెడు కోరికలను మోస్తూ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అని అనుకున్నాడు. 

మన ఆనందం మన కోరికలు తీరడంపై  ఆధారపడి ఉంటుంది. కోరికలు నెరవేరనప్పుడు, నిరాశ, కొన్నిసార్లు ఆ కోరికలే భారంగా మారి, మన గమ్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకులను సృష్టిస్తాయి. వీటన్నిటినీ తేలిగ్గా వదిలేసుకొని చీమలాగా ముందుకు వెళ్లగలమా?


జీవితపు ఉద్దేశ్యం ఏమిటి, మన జీవితం నుండి మనం ఏమి ఆశిస్తున్నాం, ఇలాంటివి మనం అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా?


అతను తన ఆలోచనలలో లోతుగా మునిగిపోయుండగా, అకస్మాత్తుగా డోర్బెల్ మోగింది. అతను తన కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళాడు.


బయటికి అంతా మామూలుగా అనిపించినా, లోపల మాత్రం కొత్త ఆలోచనల సుడిగుండం అతనిలో ఎగసింది.


కోరికల నుండి మనల్ని మనం విడిపించుకోనే ఏకైక మార్గం - వాటి నుండి మన దృష్టిని మరల్చి వాస్తవమైన  విషయంపై దృష్టి పెట్టడం.  💌


    బాబూజీ


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl


#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu