Thursday, December 15, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-24 ---- Daily One SHORT STORY for All - 09/12/2022

 ♥️ కథ-24 ♥️

ఒక యధార్థ గాథ .....

నేను నా ఆఫీసు కంప్యూటర్ ముందు కూర్చునే వరకు ఆరోజు ఉదయం చాలా మాములుగా గడిచింది.

" మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది," అని నా స్క్రీన్‌పై సర్వర్ సందేశం మెరిసింది, దానిని మార్చడానికి సూచనలతో పాటుగా. 

మా కంపెనీలో, మేము మా పాస్‌వర్డ్‌లను ప్రతీ నెల మార్చాల్సి ఉంటుంది.

ఇటీవలే నా ప్రియురాలితో విడిపోయిన నేను తీవ్రంగా కృంగిపోయి ఉన్నాను. 

ఆమె నన్నువదిలేసిందన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోవడంతో, రోజంతా అదే మనసులో తిరుగుతూఉంది.

మా మాజీ బాస్ వద్ద విన్న ఒక చిట్కా గుర్తుకు వచ్చింది. 

అతను, " నా జీవితాన్ని మార్చే పాస్‌వర్డ్‌ని నేను ఉపయోగించబోతున్నాను",అని అనేవాడు.

నా ప్రస్తుత మానసిక స్థితిలో పనిపై దృష్టి పెట్టలేకపోయాను. 

పాస్‌వర్డ్‌ను మార్చమని వచ్చిన తక్షణ సూచన, నా ఇటీవలి బ్రేకప్‌కు ( విడిపోవడానికి ) నేను బాధితుడిని కాకూడదని, దాని గురించి ఏదైనా చేయగలిగినంత సమర్థత నాలో ఉందని నాకు గుర్తు చేసింది.

నా పాస్‌వర్డ్‌ని ఇలా మార్చుకున్నాను : Forgive@her. (ఆమెను@క్షమించు)

 నా కంప్యూటర్ లాక్ అయిన ప్రతిసారీ నేను ఈ పాస్‌వర్డ్‌ని చాలాసార్లు టైప్ చేయాల్సివస్తుంది. 

నేను భోజనం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ, నేను ‘ఆమెను క్షమించు’ అని వ్రాసేవాడిని.

ఈ సాధారణ చర్య నేను నా మాజీ ప్రియురాలిని చూసే విధానాన్ని మార్చింది. 

సయోధ్యకు సంబంధించిన ఆ స్థిరమైన చిహ్నం, విషయాలు జరిగిన విధానాన్ని స్వీకరించేలా చేసి, నా నిరాశను ఎదుర్కోవడంలో నాకు సహాయపడింది.

తర్వాత నెలలో నా పాస్‌వర్డ్‌ని మార్చమని సర్వర్ నన్నుగుర్తుచేసే సమయానికి, నేను స్వేచ్ఛగా ఉన్నట్లు భావించాను. ఆ అనుభూతిని ఇష్టపడ్డాను. 

ఈ చిన్న ప్రయోగం యొక్క అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోయాను!  నేను దానిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.

తదుపరిసారి నేను నా పాస్‌వర్డ్‌ని మార్చవలసి వచ్చినప్పుడు, నేను మార్చుకోవలసిన తర్వాతి విషయం గురించి ఆలోచించాను. 

నా పాస్‌వర్డ్ Quit@smoking4ever (ధూమపానం@పూర్తిగామానేయ్) అయింది.

ఇది నా లక్ష్యాన్ని అనుసరించడానికి నన్ను ప్రేరేపించింది.                                                                                     నేను ధూమపానం మానేయగలిగాను.

ఒక నెల తర్వాత, నా పాస్‌వర్డ్ Save4trip@europe ( యూరోప్ యాత్రకు@పొదుపుచెయ్యి) అయింది.

 మూడు నెలల్లో నేను యూరప్‌ను సందర్శించగలిగాను.

ఇలాంటి జ్ఞాపికలు నా లక్ష్యాలను సాధించడంలో నాకు సహాయపడడమే కాకుండా నన్ను ఉత్సాహంగా, చురుకుగా ఉంచాయి. 

మీ తదుపరి లక్ష్యం వైపు పురోగమించడం కొన్నిసార్లు కష్టం, కానీ దాని గురించి చేసే కృషి గొప్ప ఫలితాలను ఇస్తుంది.

కొన్ని నెలల తర్వాత, నా పాస్‌వర్డ్ - lifeis #beautiful

జీవితం#అందమైనది !!!

నా జీవితం మళ్లీ మారుతుందని నాకు తెలుసు.

కథలోని నీతి ఏమిటంటే...

అంతరంగ సంభాషణ ముఖ్యం, మనకు మనం చెప్పుకునేది ఆ దిశలో ఆలోచించేలా మనల్ని నియంత్రిస్తుంది. 

దీనివలన ఆ నిర్దిష్ట సమయంలోనే వాస్తవ ఫలితాలను మనం చూడవచ్చు.

మనల్ని ఆకర్షించే, వికర్షించే కోరికలు, మన ఇష్టాయిష్టాలు - వీటి వల్ల రూపుదిద్దుకునే మన దైనందిన ఆలోచనల ద్వారా మన విధిని మనకోసం సృష్టించుకుంటాం. 🌼

దాజీ

హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Friday, December 9, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-23 ---- Daily One SHORT STORY for all - 09/12/2022

 ♥️ కథ-23 ♥️

 అనుభూతి - నేను నా ఇంద్రియాలను సరైన ప్రయోజనం కోసం 

                     ఉపయోగించుకున్నందుకు నేను కృతజ్ఞతతో ఉంటాను.

మూడు బొమ్మల రహస్యం

ఒక వ్యక్తి అన్నిచోట్లా తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. 

ఒక రోజు, అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు, అక్కడ రాజుకు కొత్తవి, ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు.

రాజభవనంకు వెళ్లి, ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్లి, "మహానుభావా, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను" అని చెప్పాడు.

రాజు అతని బొమ్మలను ఆస్థానంలో  ప్రదర్శించడానికి అనుమతించాడు.

బొమ్మలు అమ్మేవాడు తన పెట్టెలోంచి మూడు బొమ్మలు తీశాడు. 

రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, "ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి. చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి" అని చెప్పాడు.

 బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, "మొదటి బొమ్మ వెయ్యి బంగారు నాణేలు, రెండవది వంద బంగారు నాణేలు, మూడవది ఒక్క బంగారు నాణెం మాత్రమే" అన్నాడు.

రాజు ఆ మూడు బొమ్మలను చాలా జాగ్రత్తగా చూసాడు, కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు, మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆశ్చర్యపోయాడు!

తానేమీ కనుగొనలేక, రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు. 

మంత్రులు అన్ని వైపుల నుండి ఆ బొమ్మలను చూశారు కాని వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

రాజు అప్పుడు రాజ పురోహితుడిని { రాజగురువుని} చూడమని అడిగాడు. 

ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మలను పరిశీలించి మూడు గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు.

గడ్డి పరకలు తీసుకురాగానే, రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు.

 అందరూ చూస్తూండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత, ఆ బొమ్మ పెదవులు కదిలి, ఆపై మూసుకుపోయాయి.

తరువాత, ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు, ఈసారి మరొక చెవి నుండి గడ్డిపరక బయటకు వచ్చింది తప్ప మరే కదలిక లేదు. 

ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తరవాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పుడు ఆయన మూడవ బొమ్మ చెవిలో గడ్డిపరకని దూర్చాడు, దాని నోరు ఒక్కసారిగా తెరుచుకుని  ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కదులుతూ ఉంది.

ఇది చూసిన రాజు, "ఇదంతా ఏమిటి? ఈ బొమ్మల ధరలో ఎందుకు అంత తేడా ఉంది?" అని రాజ పురోహితుడిని అడిగాడు.

పురోహితుడు ఇలా సమాధానమిచ్చాడు, "సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు, దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం.

ఇది మొదటి బొమ్మ నుండి మనకు లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ వెయ్యి బంగారు నాణేలు.

కొంతమంది ఎప్పుడూ తమలో తాము నిమగ్నమై ఉండి, మిగిలినవేవీ పట్టించుకోరు. వారు ఇతరుల నుండి ఎటువంటి ఆసక్తి లేదా ప్రశంసలను కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికీ హాని చేయరు. 

రెండవ బొమ్మ నుండి మనం నేర్చుకునేది ఇదే, దాని విలువ వంద బంగారు నాణేలు అవడానికి కారణం ఇదే.

కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి, నోరు వదులుగా ఉంటుంది. 

ఏదైనా విన్న వెంటనే, అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పి, సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు. 

అందుకే దాని విలువ ఒక్క బంగారు నాణెం మాత్రమే."

♾️

 స్పృహలో ఉండి చేసే పనులలో,  మనం వల్ల జరిగే అన్ని తప్పులు ఎక్కువగా మనం ఏమి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటాయి.  🌼

దాజీ

హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Thursday, December 8, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-22 ---- Daily One SHORT STORY for all - 08/12/2022

 ♥️ కథ-22 ♥️

 అనుభూతి -  నా హృదయం అనంతమైన శక్తితో నిండి ఉంది, 

                       దానికి నేను కృతజ్ఞతతో ఉంటాను.

సెయింట్ రబియా (ప్రేమతో నిండిన హృదయం యొక్క గొప్పతనం)

హృదయంలో ప్రేమ ఉంటే దుష్టులలో కూడా ద్వేషం కలుగదు.

రబియాను ఇస్లాంలో గొప్ప సాధువు అని అంటారు. ప్రపంచంలోని మహిళా సాధువులలో చరిత్రలో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. 

రబియా వల్లనే సూఫీ సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందని, ప్రపంచం ఆమెను ఎంతో గౌరవప్రదంగా స్మరించుకుంటుంది.

ప్రతిరోజూ భగవంతుని ప్రేమ, స్మరణలో జీవించిన  అత్యంత గౌరవనీయమైన మహిళా సాధువు ఐన ఆమె సుమారు 717 AD లో జన్మించింది, 84 సంవత్సరాల వయస్సులో 801 AD లో మరణించింది.

ఆమె తన తల్లిదండ్రులకు నాల్గవ సంతానం, రబియా చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తల్లి ప్రేమ, ఆప్యాయతలకు దూరమై ఒంటరిగా బాల్యాన్ని గడిపింది. 

కానీ దురదృష్టవశాత్తు, ఆమె కష్టాలు ఇక్కడితో ఆగలేదు.

ఆమె దేశంలో భయంకరమైన కరువు, క్షామం వచ్చింది, ఆమె కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు చెల్లాచెదురై, విడిపోయారు.

చిన్నారి రబియా అపహరించబడి, కేవలం 6 దిర్హామ్‌లకు (అరబ్బుల నాణెం) బానిసగా విక్రయించబడింది. 

ఆమెను కొనుగోలు చేసిన యజమాని హృదయం లేని ఒక క్రూరమైన వ్యక్తి. 

ఆమెయందు చాలా అమానవీయంగా వ్యవహరించేవాడు. ఆమె రోజంతా పని చేయాల్సివచ్చేది, తరచుగా తినడానికి ఏమీ ఉండేది కాదు.

అటువంటి పరిస్థితులలో శారీరక శ్రమ చేయడమే చాలా కష్టంగా ఉండేది, ఐనప్పటికీ ఆమె హృదయం ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో మునిగిఉండేది. 

ఆమె అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, ఎక్కువ సమయం ఆయనను ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ గడిపేది .

ఒక రోజు, ఆమె యజమాని రాత్రికి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.

యాదృచ్ఛికంగా రబియా నివసించే గదిని దాటగా, గదిలోంచి ఏవో మాటలు, గుసగుసలు వినిపించాయి. 

వెంటనే అతని మనసులో అనుమానం వచ్చింది: నా దాసీ ఇంత రాత్రి వరకు మెలకువగా ఉండి ఎవరితో మాట్లాడుతోంది?

గదిలోంచి వినిపించిన దానికీ, కిటికీలోంచి చూసిన ఆ దృశ్యానికి అతను ఆశ్చర్యపోయాడు.

 పూర్తిగా భక్తిలో మునిగిపోయిన చిన్నారి రబియాను చూసాడు. 

దేవదూతలా మోకాళ్లపై కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ఆమెను ఒక దివ్యమైన వెలుగు ఆవరించింది ఉంది. 

ఆమె, "ఓ ప్రభూ, నా యజమానిని క్షమించి, అతనిని ఆశీర్వదించండి." అని గుసగుసలాడుతూ ప్రార్థిస్తోంది.

  రబియా నిజానికి అతని కోసం ప్రార్థిస్తోంది! ఆమె పట్ల చెడుగా ప్రవర్తించిన, పదే పదే కొట్టి, చెప్పలేనంతగా హింసించిన అదే    యజమాని కోసం;

 ఐన కూడా అతను ఆశీర్వదించబడాలని, క్షమించబడాలని కోరుకుంటోంది !

" అల్లా! నా యజమానిని కరుణించి, అతనికి శ్రేయస్సు ప్రసాదించు, అతని తప్పులను క్షమించి, సన్మార్గంలోకి తీసుకురండి, మీ వద్దకు వచ్చేలా ఏదైనా చేయండి ప్రభూ. మీరు ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉంటారు, దయచేసి అతనికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. !"

ఆ ప్రార్థన విని యజమాని సిగ్గుతో, అపరాధభావంతో వణికిపోయాడు. తిరిగి తన గదిలోకి వెళ్ళాడు. 

రబియాకు చాలా అన్యాయం చేశాడని, ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని  గ్రహించి అతను రాత్రంతా నిద్రపోలేకపోయాడు. 

ఆమె సాధారణ బానిస కాదని, నిజంగా భగవంతుని ఆశీర్వాదం పొందిన బిడ్డ అని, దివ్యమైన ఆత్మ అని, అలాంటి ఆమెను బానిసగా ఉంచి, పని చేయించుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు.

అతను మరుసటి రోజు ఉదయం రబియా గదికి వెళ్లి, ఆమె పాదాలపై పడి క్షమాపణ చెప్తూ : " తల్లీ ! నీవు భగవంతుని పుత్రికవు. నేను నీకు,అల్లాకు చేసిన తప్పుకు నన్ను క్షమించు. 

ఈ రోజు నుండి నువ్వు నా ఇంట్లో ఒక బానిసలా కాకుండా గౌరవనీయమైన అతిథిగా ఉండు, దయచేసి నాకు కూడా ఆ గొప్ప అల్లాకు సేవ చేసే అవకాశం ఇవ్వు." అని అభ్యర్ధించాడు.

                ♾️

ధ్యానం చేసే హృదయంలో ప్రేమ మహోన్నతంగా ప్రకాశించినప్పుడు, అది దేనిని తాకినా అది అద్భుతంగా మార్పుచెందుతుంది.  🌼

దాజీ

హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

365 రోజులు హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-21 ---- Daily One SHORT STORY for all - 07/12/2022

 కథ-21  Date : 07/12/2022

అనుభూతి - ప్రేమతో నిండిఉన్న నా హృదయానికి నేను కృతజ్ఞతతో ఉంటాను.

తెరిచే సాధనం 🔨🔑

ఒకానొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగుచేసే దుకాణం ఉండేది. అక్కడి నుంచి తాళం కప్పలు, తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు. కొన్నిసార్లు, తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునే వారు.

దుకాణం తాళాలు పగులగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది.

“ చిటికెలో ఎంతటి బలమైన తాళాలైనా తెరవగలిగే ఈ చిన్న తాళాలలో ఏముంది, నేను మాత్రం ఆ తాళంకప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది', అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది.

ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి, ఓ చిన్న తాళం చెవిని అడిగాడు," అక్కా, ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళంకప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు. ?"

తాళం చిరునవ్వుతో ఇలా అంది, "నిజానికి, మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు, ఆ క్రమంలో వాటిని పగులగొడతారు.

నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను, దాని లోపల నా స్థానాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను. ఆ తర్వాత, తెరవమని అభ్యర్థిస్తాను, అది వెంటనే తెరుచుకుంటుంది."

మిత్రులారా, మానవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే, వారిని మన సొంతం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం.

ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా, మనం తాళాన్ని తెరవం, బదులుగా దానిని పగలగొడతాం.

అంటే, మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం. అయితే, ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా, మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం. వారి ఉపయోగాన్ని, సమర్ధతను అనేక రెట్లు పెంచుతాం.

బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు, కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము.

♾🌼

లాలాజీ

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Tuesday, December 6, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-20 ---- Daily One SHORT STORY for all - 06/12/2022

 ♥️ కథ-20 ♥️

అనుభూతి - ప్రతి శ్వాసకు నేను కృతజ్ఞుడను

                                                                                                                                           అత్యంత ధనవంతుడు                                

                                                                                                                                                                                                                                                                                                                                            జాన్ డి రాక్ఫెల్లర్  ప్రపంచంలో బిలియనీర్ అయిన మొట్టమొదటి వ్యక్తి, అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.

25 సంవత్సరాల వయస్సులో, అతను US లో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిని నిర్వహించాడు, 31 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారఅధికారి అయ్యాడు.

38 సంవత్సరాల వయస్సులో, అతను U.S.లో శుద్ధి చేసిన చమురులో 90% కి నాయకత్వం వహించాడు, 50 సంవత్సరాల నాటికి దేశంలోనే అతను అత్యంత ధనవంతుడు అయ్యాడు.

మరణించే సమయానికి అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 

ఒక యువకుడిగా, ప్రతీ నిర్ణయం, అతని వైఖరి, ప్రతీ సంబంధం - అతని వ్యక్తిగత శక్తి, సంపదను సృష్టించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు ఉండేది.

కానీ 53 ఏళ్ల వయసులో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరం మొత్తం నొప్పితో చిత్రహింస పడ్డాడు, తన వెంట్రుకలను కోల్పోయాడు.

ప్రపంచంలోని ఏకైక బిలియనీర్ కు ఏదైనా కొనగలిగే శక్తి ఉంది, బాధాకరమైన విషయం ఏమిటంటే, అతను సూప్, క్రాకర్స్ తప్ప మరేదీ  జీర్ణించుకోలేకపోయేవాడు. 

అతని సహచరుడు ఒకరు ఇలా వ్రాశాడు, "అతను నిద్రపోలేకపోతున్నాడు, నవ్వలేకపోతున్నాడు, జీవితంలోనివన్నీ అతనికి అర్థరహితమైపోయాయి."

అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగత వైద్యులు అతను ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తారని తేల్చి చెప్పారు.

ఆ సంవత్సరం చాలా భారంగా, చాలా నెమ్మదిగా గడిచిపోయింది.

మరణానికి సమీపంలో, ఒక ఉదయం, తనకున్న సంపదను దేనినీ తనతో పాటు తర్వాతి ప్రపంచంలోకి తీసుకెళ్లలేడనే ఒక వివేకంతో మేల్కొన్నాడు.

యావత్ వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి, అకస్మాత్తుగా తన స్వంత జీవితాన్ని తాను నియంత్రించుకోలేకపోతున్నాడని గ్రహించాడు.

అతనికి ఇప్పుడు ఒకే ఒక అవకాశం మిగిలింది.

 తన న్యాయవాదులను, అకౌంటెంట్లను, నిర్వాహకులను పిలిచి, తన ఆస్తులను ఆసుపత్రులకు, పరిశోధన, స్వచ్ఛంద కార్యక్రమాలకు తరలించాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఆ విధంగా, జాన్ D. రాక్ ఫెల్లర్ తన ఫౌండేషన్ ను స్థాపించాడు. 

సమయానుగుణంగా ఈ కొత్త దిశ పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు, మలేరియా, క్షయ, డిఫ్తీరియా నివారణలకు దారితీసింది.

కానీ బహుశా రాక్ ఫెల్లర్  కథలో అత్యంత అద్భుతమైన అంశం ఏమిటంటే, తన సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించిన క్షణం నుండి, అతని శరీరంలో చాలా గణనీయమైన మార్పులు జరిగి, తద్వారా అతను మెరుగుపడటం ప్రారంభించాడు.

అతను 53 సంవత్సరాల వయస్సులో చనిపోతాడని అనుకున్నది, 98 సంవత్సరాలు జీవించాడు!

రాక్ ఫెల్లర్  కృతజ్ఞతను నేర్చుకున్నాడు, తన సంపదలో ఎక్కువ భాగాన్ని తిరిగి ఇచ్చాడు. అలా చేయడం వల్ల స్వస్థత చేకూరడమే కాకుండా, అతను పరిపూర్ణుడయ్యాడు.

అతను స్వస్థతకు, సంపూర్ణతకు మార్గాన్ని కనుగొన్నాడు.

స్వామి వివేకానందను కలిసిన తర్వాత రాక్ ఫెల్లర్  ప్రజా సంక్షేమం కోసం తన మొదటి పెద్ద విరాళాన్ని ఇచ్చాడని, క్రమంగా ఒక విశిష్టమైన పరోపకారి అయ్యాడని చెబుతారు. 

పేదవారికీ, కష్టాల్లో ఉన్నవారికి  సహాయం చేయడానికి, రాక్ ఫెల్లర్ కు తన దాతృత్వం ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వివేకానంద సూచించారు.

మరణానికి ముందు, అతను తన డైరీలో ఈ విధంగా వ్రాసాడు:

"నాకు పని చేయడం, ఆడుకోవడం నేర్పించబడింది, 

 నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవుదినం;

 పుష్కలంగా పని , పుష్కలంగా ఆట

 ఆందోళనను నేను దారిలో వదిలేసాను

 భగవంతుడు నాకు ప్రతిరోజూ మేలు చేసాడు!"

 ఇవ్వడంలో ఆనందమే, జీవించటంలోని అసలైన ఆనందం.                   

                                           ♾️

" ప్రపంచంలోని అన్ని సంపదల కంటే అంతర్గత శాంతి అత్యంత ముఖ్యం." 🌼

    బాబూజీ

హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం  💌

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Monday, December 5, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-19 ---- Daily One SHORT STORY for all - 05/12/2022

 ♥️ కథ-19 ♥️

అనుభూతి - నా హృదయం ఉన్న దైవత్వానికి నేను కృతజ్ఞుడను

 ఎవరు మూర్ఖుడు?

ముల్లా నసీరుద్దీన్ మనందరికీ సుపరిచితమే. 

సుమారు 800 సంవత్సరాల క్రితం, తెలివైన ముల్లా టర్కీ, ఇరాన్, బాగ్దాద్ ఎడారులలో తిరిగేవాడు. 

వివేకాన్ని, జ్ఞానాన్ని అతను చాలా అసాధారణమైన పద్ధతులలో పంచుకునేవాడు . 

అతను బోధించేవాడు కాదు లేదా ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు, కానీ విషయాలను వివరించడానికి హాస్యాస్పదమైన చేష్టలు, సాధారణ ఉదాహరణలను ఉపయోగించేవాడు.

ఏదైనా విషయాన్ని హాస్యాస్పదంగా వివరిస్తే అది ఆ వ్యక్తి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని అతని నమ్మకం.

ఒకరోజు ముల్లా మార్కెట్ గుండా వెళుతున్నాడు. సాధారణంగా గాడిదపై ప్రయాణించేవాడు, అది కూడా దాని వెనుక వైపుకు తిరిగి కూర్చుని.

ఆ కూర్చున్న పద్ధతే అందర్నీ నవ్వించడంలో ఆశ్చర్యం లేదు.

ఆ రోజు మార్కెట్ కు వెళ్లి ఖర్జూరాలు కొన్నాడు. దుకాణదారుడికి డబ్బు చెల్లించే సమయానికి, అతను తన బూట్లు విప్పేసి, నేలపై కూర్చున్నాడు. 

బూట్ల లోపల మూల మూలల్లో వెతకడం ప్రారంభించాడు, కాని డబ్బు దొరకలేదు. 

అతను తన పైజామా జేబుల్లోపల చూసాడు, కానీ డబ్బు అక్కడ కూడా లేదు. 

అప్పటికి అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఇప్పటికే, గాడిదపై స్వారీ చేసే అతని అసాధారణ శైలి జనాలను కూడదీయడానికి సరిపోతుంది, 

ఇప్పుడు అతని చోద్యమైన చేష్టలు కూడా ప్రజల ఆకర్షణకు కేంద్రంగా మారాయి.

ఇప్పుడు ఒకవైపు ముల్లా వింత వింత ప్రదేశాల్లో డబ్బులు వెతుకుతూనే, మరోవైపు కొన్న ఖర్జూరాలు కూడా తింటూ ఉన్నాడు. 

 దుకాణదారుడు అది చూసి కొంచెం ఆందోళన చెందుతూ, ఇలా అనుకున్నాడు, "మొదట, ఈ వ్యక్తి అస్సలు అవకాశం లేని ప్రదేశాలలో డబ్బు కోసం వెతుకుతున్నాడు, దానికి తోడు డబ్బు చెల్లించకుండా సంతోషంగా ఖర్జూరాలు తింటున్నాడు. 

డబ్బు దొరక్కపోతే, నేను అతని కడుపులో ఉన్న ఖర్జూరాలు తిరిగి తీసుకోగలనా?"

దుకాణదారుడు ఇదంతా ఆలోచిస్తుండగానే, ముల్లా తన తలలోని టోపీని తీసి అందులో డబ్బు కోసం వెతకడం ప్రారంభించాడు. 

దుకాణదారుడు ఇంక ఆపుకోలేక ముల్లాతో, "ఎందుకు డబ్బు అక్కడా ఇక్కడా వెతుకుతున్నావు? నీ కుర్తా జేబులో ఎందుకు చూడవు?" అని అడిగాడు.

దీనికి ముల్లా, "అదీ, ఇంతకు ముందే నువ్వు ఇది ఎందుకు సూచించలేదు?" అని అంటూ, ముల్లా కుర్తా జేబులో చేయి వేసి, దుకాణదారుడికి డబ్బు అందజేసి, ఇలా చెప్పాడు - "ఇది ఇందాకడినుండి ఇక్కడే ఉంది, కానీ నేనే అవకాశం కోసం చూస్తున్నాను." అన్నాడు.

అది విన్న జనమంతా నవ్వడం మొదలుపెట్టారు. 

గుంపులో ఒక పెద్దాయన,"చూడడానికి పిచ్చివాడిలా ఉన్నాడే, కుర్తా జేబులో డబ్బులున్నాయని తెలిసి, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాడు!" అని అన్నాడు. 

ముల్లా ఈ నాటకం అంతా ఎందుకు ఆడాడో, ఏం చెప్పాలనుకున్నాడో ఇప్పుడతనికి చెప్పాల్సిన సమయం వచ్చింది. 

చాలా గంభీరంగా అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు -

" డబ్బు ఎక్కడ ఉందో అక్కడ నేను వెతకలేదు కాబట్టి నాకు పిచ్చి ఉందని మీరందరూ అనుకుంటున్నారు. అయితే దయచేసి మిమ్మల్ని మీరు చూసుకోండి, ఆలోచించండి, ఆత్మపరిశీలన చేసుకోండి. 

మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినప్పటికీ, మీరు ఆయన కోసం వెతుకుతూనే ఉంటారు.

నేను పిచ్చివాడిని అయితే, మీ అందరి సంగతేంటి? 

నేను ఇంత చిన్న విషయంలో మూర్ఖంగా ఉన్నాను, కానీ మీరు జీవితంలోని అతిపెద్ద సత్యం విషయంలో మూర్ఖంగా ఉన్నారు!".

ముల్లా నసీరుద్దీన్ చేసిన ఈ హృదయపూర్వక విజ్ఞప్తి మానవాళి అంతటికీ ఇప్పటికీ ఒక పాఠం, ఒక హెచ్చరిక.

ఆ అనంతత్వం, ఆ పరమాత్మ, మన హృదయంలోనే ఉంది, మనం ఆయనను మరెక్కడో కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాం!

                       ♾️

శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే, మనలో మనం లోతుగా చూసుకోవాలి. 🌼

దాజీ

హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం  💌

టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

Saturday, December 3, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-18 ---- Daily One SHORT STORY for all - 03/12/2022

 ♥️ కథ-18 ♥️

అనుభూతి : నా ప్రవర్తనను తీర్చిదిద్దడంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను

ప్రవర్తన

ఒకానొకప్పుడు వైవిధ్యమైన శాస్త్రాలలో ఉన్న అపారమైన జ్ఞానం వల్ల దేశంలోని వారందరి చేత గౌరవించబడే ఒక రాజ పురోహితుడు ఉండేవాడు. అంతటి జ్ఞానవంతుడైనా, ఆయనకి కొంచెం కూడా అహం లేదు. 

ప్రాపంచిక, ఆధ్యాత్మిక పురోగతికి జ్ఞానం, ప్రవర్తనల కలయిక మాత్రమే నిజమైన మార్గం అని ఆయన విశ్వసించాడు. 

ప్రజలకే కాదు, మహారాజుకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. 

పురోహితుడు రాజాస్థానానికి వచ్చినప్పుడు రాజు ఎల్లప్పుడూ తన సింహాసనం నుండి లేచి, పురోహితుడు కూర్చున్న తర్వాత మాత్రమే కూర్చునేవాడు.

ఒకసారి పురోహితునికి తనకు ఈ గౌరవం ఎందుకు లభిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది - ఈ గౌరవం తన  జ్ఞానం కోసమా లేక  తన బలమైన నైతిక స్వభావానికి ఆదరణా ? 

అది కనిపెట్టడానికీ, తన ఉత్సుకతను సంతృప్తిపరచడానికీ ఒక పథకం వేసుకున్నాడు.

తన ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావడానికి, పురోహితుడు రాజు యొక్క ఖజానాకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా నిధిలోంచి ఐదు అమూల్యమైన ముత్యాలు తీసి జేబులో పెట్టుకున్నాడు. 

అది చూసిన కోశాధికారి ఆశ్చర్యపోయాడు. గౌరవనీయులైన రాజ పురోహితుడు దొంగతనం చేయగలడని లేదా ధనం అంటే దురాశ కలవాడని అతను నమ్మలేకపోయాడు. ఈ ఆలోచనతో రోజంతా కలవరపడ్డాడు.

మరుసటి రోజు, రాజదర్బార్ నుండి తిరిగి వస్తుండగా, పూజారి మళ్లీ ఖజానాను సందర్శించి, ఐదు ముత్యాలను తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. 

ఇప్పుడు, కోశాధికారికి పూజారి పట్ల ఉన్న గౌరవం క్షీణించడం ప్రారంభమైంది.

మూడో రోజు కూడా అదే సంఘటన జరగడంతో కోశాధికారి ఓపిక నశించి ఇక ఆగలేకపోయాడు. రాజ పురోహితుడు దుష్ట ఆంతర్యాలు కలిగిఉన్నాడన్న అతని అనుమానం ధృవీకరించబడింది.

జరిగిన సంఘటన అంతా రాజుకు వివరంగా చెప్పాడు. ఈ సమాచారం విన్న రాజు చాలా ఆశ్చర్యపోయాడు. పురోహితుని పట్ల రాజుకు గల గౌరవం, విశ్వాసం పూర్తిగా ధ్వంసం అయిపొయింది.

పురోహితుడు నాల్గవ రోజు రాజాస్థానానికి వచ్చినప్పుడు, రాజు అతనిని పలకరించడానికి సింహాసనం నుండి లేవలేదు సరికదా అతని వైపు చూడలేదు. 

పూజారి తన ప్రణాళిక పనిచేస్తున్నది అన్నదానికి దీనిని ఒక చిహ్నంగా తీసుకున్నాడు. 

అతను ముత్యాలు తీసుకున్న ప్రయోజనం త్వరలో నెరవేరబోతోందన్న ఆలోచనతో, నిశ్శబ్దంగా తన స్థానంలో కూర్చున్నాడు.

రాజకీయ కార్య‌కలాపాలు పూర్తి అయిన త‌ర్వాత, పురోహితుడు మిగ‌తా స‌భ్యుల‌లాగా బ‌య‌లుదేర‌డానికి లేచినప్పుడు, రాజు ఆయన్ని కొంత సేపు వేచిఉండమని ఆదేశించాడు.

మిగిలిన సభాసదులందరూ వెళ్ళిపోయిన తర్వాత, రాజు ఆయనని అడిగాడు, "మీరు రాజ ఖజానా నుండి ఏదో తీసుకున్నారని నేను విన్నాను, అది నిజమేనా?".

ఈ ప్రశ్నకు పురోహితుడు మౌనంగా ఉండడంతో రాజుకు కోపం వచ్చింది. 

ఈసారి స్వరం పెంచి, “రాజ ఖజానా నుండి ముత్యాలు తీశారా ?” అని అడిగాడు. 

పురోహితుడు మౌనంగా అవునన్నట్లుగా తల వూపాడు.

రాజు తర్వాతి ప్రశ్న: "ఎన్ని ముత్యాలు తీసుకున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు?" అని కాసేపు ఆగి, తర్వాత ఇలా అడిగాడు, “ఆ ముత్యాలు ఎక్కడ ఉన్నాయి?”

పురోహితుడు తన జేబులోంచి చిన్నగా మడతపెట్టిన సంచి తీసి రాజు ముందు పెట్టాడు. అందులో మొత్తం పదిహేను ముత్యాలున్నాయి. 

దుశ్చర్యకు సంబంధించిన రుజువు చూసిన రాజుకు ఒక్కసారిగా కోపం, విచారం, ఆశ్చర్యం కలిగాయి.

రాజు ఇలా అన్నాడు, “ స్వామి ఇలా ఎందుకు చేసారు? కనీసం మీ పదవితో ముడిపడిన గౌరవం గురించి అయినా మీరు పట్టించుకోలేదా? ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించలేదా ? అలా చేయడం వల్ల మీరు మీ జీవితకాలపు పరువును పోగొట్టుకున్నారు.” 

“ ఏదో ఒకటి చెప్పండి, ఎందుకు ఇలా చేశారు?”

బాధలో ఉన్న రాజుని చూసి, పురోహితుడు ప్రతిదీ వివరంగా చెప్పి , తృప్తిగా అన్నాడు, "మహారాజా,  జ్ఞానం, ప్రవర్తన - ఈ రెంటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికే ఖజానా నుండి ముత్యాలను తీసుకున్నాను. 

నైతికమైన, ఋజుప్రవర్తన యొక్క ప్రాముఖ్యతపై నా దృక్పథం ఇప్పుడు చాలా స్పష్టమైంది”.

మీ నుండి, మీ ప్రజల నుండి ఇప్పటివరకు నాకు లభించిన ప్రేమ, గౌరవం నా జ్ఞానం వల్ల కాదు, నా ప్రవర్తన వల్ల. 

మీ ఖజానాలో అత్యంత విలువైనది 'ప్రవర్తన'.

కాబట్టి, మీ రాజ్యంలోని ఉన్నత నైతికత కలిగిన వ్యక్తులను మీరు ప్రోత్సహించాలని,  అభినందించాలని నేను కోరుకుంటున్నాను. 

ఈ విధంగా, ప్రజల దృష్టిలో ఉన్నత ప్రవర్తన యొక్క విలువ క్రమంగా పెరిగి , బలమైన దేశానికి పునాది వేయబడుతుంది.

శతాబ్దాలుగా ఒక బలమైన నైతిక ప్రవర్తన, జ్ఞానం యొక్క అహంకారంపై విజయం సాధించిందనడానికి చరిత్రయే రుజువు .

                                   ♾️

" మంచి హృదయం, దయగల భావాలు, సమతుల్య మనస్సు - ప్రవర్తనకు పునాదిగా ఉంటాయి." 🌼